ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ఏడు రోజుల్లో పూర్తి చేయాలి

 

Anudeep Durishetty

  • పేదల సొంతింటి కల నెరవేర్చెందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు
  • డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా కేటాయించాలి
  • సమీక్షా సమావేశంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

పేదల సొంతింటి కల నెరవేర్చెందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికార్లను ఆదేశించారు. పెండింగ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక, ప్రోసిడింగ్స్ పంపిణీ ప్రక్రియను వారం రోజులలో పూర్తి చేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి  ఇందిరమ్మ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,500 ఇందిరమ్మ ఇండ్లను పూర్తి స్థాయిలో మంజూరు చేయాలన్నారు. గ్రామానికి మొదటి విడతలో కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల సంఖ్య ప్రకారం, లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. ఇందిరమ్మ కమీటిలను సంప్రదిస్తూ, బఫర్ సంఖ్యతో కలిపి లబ్దిదారుల జాబితా తెప్పించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీల నుంచి వచ్చిన జాబితాను మరో సారి నిర్ధారించుకొని ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3, 500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికతో పాటు లబ్ధిదారుల వివరాలు సేకరించి బఫర్ జాబితా రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో లబ్ధిదారులకు పంపిణీ చేయ కుండా పూర్తి చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల రిపోర్ట్ వెంటనే అందించాలన్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించాలన్నారు. అర్హులైన నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చేరాలని, గతంలో లబ్దిదారులను కేటాయించని వాటికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ కమిటీ నుంచి లిస్ట్ తీసుకుని అధికారులు వెరిఫై చేసి లబ్దిదారుల ఎంపిక చేయాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వీటిని సొంత భూమి లేని నిరుపేదలకు కేటాయించి, ఇందిరమ్మ ఇండ్ల క్రింద నిధులు మంజూరు చేసి పూర్తి చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమీక్ష లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ  పైలెట్ గ్రామాలలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇండ్లలో ఇప్పటి వరకు 500 పైగా గ్రౌండ్ చేయడం జరిగిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పి సీఈవో దీక్షా రైనా, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, ఆర్డీఓలు జి. నరసింహరావు, ఎల్. రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి